కరోనా వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. అయితే కరోనా కాలంలోనూ ఏపీలో మూడు రాజధానుల అంశం మళ్లీ వేడెక్కింది. ఈ రాజధాని బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన నిర్ణయం తీసుకున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు ఈ పత్రిక పేర్కొంది. దీని ప్రకారం.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి వివరాలు కోరింది.
గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు తదితర బిల్లులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలనేది కేంద్రప్రభుత్వం ఆధీనంలోని అంశమని, దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. ఇంకా తదుపరి విచారణను ఆగష్టు 6కు వాయిదా వేసింది.
అంతేగాకుండా.. మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం ఆరా తీస్తోంది. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశం. హైకోర్టు నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగింది. రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాశామని జీవిఆర్ శాస్త్రి తెలిపారు. చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించామన్నారు. దీనిపై అటార్నీ జనరల్ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. లేఖపై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడిగిందన్నారు.