రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10 శాతం, మరికొందరికి 50 శాతం మేరకు వేతనాల్లో కోత విధించారు.
ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని డ్రాయింగ్, డిజ్బర్స్‌మెంట్ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ (ఆర్‌సీ నంబరు: 1/ఏ/2021) ఆదేశించింది.
అయితే... క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు శనివారం మండల అధికారులకు వినతులు ఇచ్చారు. సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డాటాను రూపొందించాలని కోరారు.
సిగ్నల్ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి.