Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో 13,182 పరిశ్రమలకు అనుమతి

పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకూల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్య తరహా, చిన్న సూక్ష పరిశ్రమల వరకు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు – భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానిక

Advertiesment
ఆంధ్రప్రదేశ్‌లో 13,182 పరిశ్రమలకు అనుమతి
, గురువారం, 15 డిశెంబరు 2016 (11:26 IST)
పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకూల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్య తరహా, చిన్న సూక్ష పరిశ్రమల వరకు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు – భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులతోపాటు నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉంటంతో దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. 
 
వీటన్నిటికీ తోడు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించడంతోపాటు ఏ పరిశ్రమకైనా కావలసిన పత్రాల్ననీ సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే ఆన్ లైన్ లో అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రారంభించింది.  పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా  రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది.
 
రాష్ట్రంలో ఇన్ని అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల సింగిల్ డెస్క్ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు 14,181 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 13,182 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. అత్యధికంగా ఎనర్జీ విభాగంలో 2926 దరకాస్తులకు ఏపీఎస్ పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీ లిమిటెడ్) ఆమోదం తెలిపింది. ఆ తరువాత పరిశ్రమల శాఖ 1594 దరకాస్తులకు పరిశ్రమ ప్లాన్ల అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు పొందినవాటిలో అతి భారీ పరిశ్రమలు(మెగాప్రాజెక్టులు), భారీ పరిశ్రమలు, సూక్ష, మధ్య, చిన్న తరహా అన్ని పరిశ్రమలు  ఉన్నాయి. 811 దరకాస్తులు తిరస్కరించారు. సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ పరిధిలో 188 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విధంగా 14 రోజుల్లో పూర్తిగా ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఏపీ ఒక్కటే.
 
పరిశ్రమ స్థాపించడానికి  ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వంలోని 14 శాఖల నుంచి 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. 
 
ఈ అనుమతులు పొందడానికి గతంలో ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇందుకు  సుదీర్ఘ కాలం పట్టేది. అయితే ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించారు.  రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులు మొదలుకొని చిన్న తరహా పరిశ్రమల వరకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్, బాయిలర్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, బావుల తవ్వకం, అగ్నిమాపక శాఖ, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. 
 
కొన్ని పరిశ్రమలకు  సంబంధించి ఉత్పత్తుల ఆధారంగా ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు. పరిశ్రమలకు కావలసిన ముడిపదార్ధాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపుల విధానాన్ని కూడా సింగిల్ డెస్క్ పరిధిలోకే తీసుకువచ్చారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యంత శక్తివంతులు... నరేంద్ర మోదీ నెం.9