కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందున్నది చెప్పొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వారిని గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచడంలో ఏపీ సర్కారు పూర్తిగా సఫలీకృతమైంది. ఫలితంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అలాగే, రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలును కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు రోగ నిర్ధారణ పరీక్షల తోపాటు ఇన్‌పేషంట్ సేవలు మొత్తం ఏపీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.
ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలను ఎప్పుడు వినియోగించుకోలన్న విషయాన్నీ మాత్రం ఆయా జిల్లా కలెక్టర్ల పరిధికి వదిలివేసింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రజలందరు సామాజిక దూరం పాటించాలని, రోడ్లపైకి అత్యంత అవసరమైతే తప్ప రావద్దని హెచ్చరించింది.
కూరగాయలు, నిత్యావసరాలు, మందుల పేరుతో జనం రోడ్లపైకి వస్తూ.. షాపుల వద్ద, రైతు బజార్ల వద్ద పెద్ద సంఖ్యలో సామాజిక దూరం పాటించకుండా వుంటున్నారు. దాంతో కరోనా వైరస్ వ్యాప్తికి మరింత వెసులుబాటు కలుగుతుందని, ఫలితంగా వ్యాధి బారిన పడే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే కరోనా ప్రభావం మూడో దశకు వెళుతుందని, అప్పుడు దాన్ని నియంత్రించడం కష్టమవుతుందని భావిస్తోంది. అందుకే మరిన్ని కఠిననిర్ణయాలు చేయకతప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సమయం ఇవ్వాలని, గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు సమయం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.