తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న వైకాపా నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగానే కౌంటరిచ్చారు. తనను ఎద్దుతో వైకాపా నేతలు పోల్చారు. దీనికి కౌంటర్‌గా నారా లోకేశ్ స్పందిస్తూ, తాను ఎద్దు అయితే, మీ ముఖ్యమంత్రి దున్నపోతా అంటూ సూటిగా ప్రశ్నించారు.
అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోమని తాము డిమాండ్ చేస్తున్నామేగానీ, తమను ఆదుకోమని కాదన్నారు. తనకు హోదా లేదని.. ఆవేదన ఉందన్నారు. తనను ఎద్దు అని ఒక మంత్రి అన్నారని.. మరి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్‌ను ఏమనాలని ప్రశ్నించారు. వారం మునిగితేనే సహాయం అంటారా.. మానవత్వం లేదా అని మండిపడ్డారు.
గోదావరి జిల్లాల్లో వరి పంట మూడు సార్లు మునిగిందని, రాయలసీమలో 10 లక్షల ఎకరాల వేరుశెనగ దెబ్బతిన్నదన్నారు. తిత్లీ వస్తే తమ ప్రభుత్వ హాయాంలో 28 రోజుల్లో సిక్కోలుకు రూ.160 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల రూపాయల సహాయం మాత్రమే చేశారన్నారు. రైతుకు రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం ఎలా అవుతుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా, రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30 వేల కోట్లు నష్టమని వాపోయారు.
రూ.4 వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. కానీ మీటర్లను అంగీకరించమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు.
ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే.. నష్టం అంచనా 100 శాతం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలన్నారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5 వేలు పరిహారం ఇవ్వాలన్నారు.
ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని, రూ.55 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. అప్పుడు ట్వీట్ రెడ్డి (ఏ2 విజయసాయి) రాజ్యసభలో కేంద్రానికి ప్రశ్న వేశారని, రూ.55వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా? అని అడడగ్గా.. ఒప్పుకున్నట్లు చెప్పిందన్నారు.
ఇప్పుడు వాళ్ల కేసుల మాఫీ కోసం ఆ నిధులను రూ.25 వేలకు కుదించారని మండిపడ్డారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తెస్తామని చెప్పిన ట్విట్ రెడ్డి ఏపీకి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్నారు.. ఎందుకని నిలదీశారు. ఎంపీల చేతకాని తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం రూ.30వేల కోట్లని లోకేశ్ చెప్పుకొచ్చారు.