Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల‌కు నాపేరు వాడుకుంటారా? ఏపీ గవర్నర్ అసంతృప్తి

Advertiesment
అప్పుల‌కు నాపేరు వాడుకుంటారా? ఏపీ గవర్నర్ అసంతృప్తి
విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (10:12 IST)
అప్పుల‌కు నా పేరు వాడుకుంటున్నారా? అంటూ ఏపీ గ‌వ‌ర్న‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం వ్యక్తిగతంగా తన పేరు వాడటంపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది.
 
 
ఈ పరిస్థితుల్లో ఆయనకు వివరణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో వ్యక్తిగతంగా తన పేరు చేర్చడంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

 
ప్రభుత్వ తీరును గవర్నర్‌ తీవ్రంగా ఆక్షేపించడంతో.. ఆయనకు వివరణ ఇచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు క్యూ కట్టినట్టు సమాచారం. రుణ ఒప్పందంలో గవర్నర్‌ పేరును ఎలా చేరుస్తారని ఇటీవల హైకోర్టు..ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. గవర్నర్‌ పేరును తొలగించి, కొత్తగా మళ్లీ ఒప్పందం చేసుకోవాలా? ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉం? అని బ్యాంకుల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి గవర్నరే అధిపతి .. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆయన తరఫునే నిర్వహిస్తారు. అక్కడ గవర్నర్‌ అన్న వ్యవస్థ ముఖ్యం తప్ప, ఆ పదవిలో ఎవరున్నా వారి పేరును ప్రస్తావించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గవర్నర్‌’ అని మాత్రమే ఉంటుంది. 

 
రాజ్యాంగబద్ధమైన పోస్టులకు సంబంధించిన నియామక ఉత్తర్వుల్లో మాత్రమే గవర్నర్‌ పేరును వ్యక్తిగతంగా వాడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో, అది కూడా నోటీసులివ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి అన్నచోట.. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అని వ్యక్తిగతంగా గవర్నర్‌ పేరు రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యారంటీ ఒప్పంద పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకాలు పెట్టాల్సిన ప్రతి చోటా ‘ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అని రాసి, దాని కింద ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సిహెచ్‌.వి.ఎన్‌.మల్లేశ్వరరావు సంతకాలు చేశారు. 

 
ఆ ఒప్పందం 19వ పేజీలోని షెడ్యూల్‌-3లో నోటీసు ఇచ్చేందుకు చిరునామా అన్న చోట మాత్రం.. శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్, కేరాఫ్‌ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్, ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్, ఏపీ సెక్రటేరియేట్‌ అని రాశారు. సాధారణంగా నోటీసు ఎవరికివ్వాలి అన్న చోట.. ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ పేరు మాత్రమే రాస్తారని, వ్యక్తిగతంగా గవర్నర్‌ పేరు రాసే సంప్రదాయం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ పేరుతో చేసుకున్న ఇలాంటి ఒప్పందం చెల్లకపోవచ్చని.. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం దావాలు, క్రిమినల్‌ కేసుల నమోదు నుంచి గవర్నర్‌కు రక్షణ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. 

 
ఒప్పందం ద్వారా గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదు అని హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఏపీఎస్‌డీసీ ఏర్పాటు, బ్యాంకుల నుంచి రుణాలు పొందడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వం చాటుకున్న నూజివీడు పట్టణ పోలీస్ కానిస్టేబుల్