ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతున్నారు. గవర్నర్ అంటే.. ఓ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. సకల సదుపాయాలు ఉంటాయి. కానీ, ఈయన మాత్రం హంగూఆర్భాటాలకు, పటాటోపాలకు దూరం. అంతేనా, తనకు ప్రత్యేక విమానం సమకూర్చవద్దని అధికారులకు చెప్పారు. తన వల్ల ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని తన అధికారులను కోరారు.
రాష్ట్ర గవర్నర్ హరిచందన్... శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లాలని భావించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రత్యేక విమానంలో వెళ్లవచ్చు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని అధికారులూ ఆయనకు చెప్పారు. ప్రత్యేక విమానం అంటే చాలా అద్దె ఉంటుంది.. అవసరం లేదు.. మామూలుగా అందరితో పాటే విమానంలో వెళ్తానని ఆయన చెప్పారు.
అయితే విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు లేదని అధికారులు విన్నవించారు. అయినా ఫర్వాలేదు.. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటానని చెప్పి, అదేవిధంగా గురువారం తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు.
అంతేకాదండోయ్... తిరుమల కొండపై కూడా ఎక్కువ సేపు ఉండలేదు. తానక్కడ అధిక సమయం గడిపితే సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. తిరుమలలో గెస్ట్‌హౌ్‌సలో ఉన్నా.. ఆలయ ప్రాంగణంలో ఉన్నా.. టీటీడీ అధికారులంతా తన సౌకర్యాలమీదే దృష్టిపెడతారన్న ఉద్దేశంతో కేవలం గంట పాటే అక్కడున్నారు. దర్శనాంతరం మళ్లీ కిందకు వచ్చి.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సాధారణ విమానంలో వచ్చారు. అక్కడి నుంచి మరో సాధారణ విమానంలో రాత్రికల్లా విజయవాడ చేరుకున్నారు.