కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా కొన్నిరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిన్నటి నుంచి వాట్సప్ గ్రూపుల్లో నైట్ కర్ఫ్యూ వార్త ట్రోల్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. నైట్ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో ఏ విధమైన నైట్ కర్ఫ్యూ విధించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికగా ఈ తరహా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇటువంటి వార్తల్ని నమ్మవద్దని వెల్లడించారు అధికారులు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. వాస్తవానికి జనవరి 8 నుంచి అంటే నేటి నుంచి నైట్ కర్ప్యూ విధిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.