ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి వార్షిక రాష్ట్ర బడ్జెట్‌ను సిద్ధం చేస్తుంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్రం పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధుల దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలుచేసేలా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే రూ.90 వేల కోట్లకు పైగా కావాలని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతుభరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్‌కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
రాష్ట్ర బడ్జెట్‌లోనూ ఈ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలున్నాయి. రైతుభరోసా (గతంలో రైతు బంధు)కు ఏటా బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల వరకూ కేటాయిస్తున్నందున ఈ ఏడాది కూడా అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయశాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయశాఖకు ఈ ఏడాది రూ.55 వేల కోట్ల వరకూ కావాలనే అంచనాలున్నాయి. ఇందులో రూ.31 వేల కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకూ పనులు పూర్తయినవి ఉన్నాయి.
వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చుపెట్టి మిగిలిన పనులు పూర్తిచేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దాదాపు రూ.19,500 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ ఆర్థికశాఖకు తెలిపినట్లు సమాచారం. ఇవి కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీల, అసలు సొమ్ము కిస్తీల చెల్లింపులకూ భారీగా నిధులు అవసరం. విద్యుత్ రాయితీ పద్దు కింద రూ.15 వేల కోట్లు కావాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు రూ.150 కోట్ల దాకా అవసరమని డిస్కంల అంచనా.