Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

Advertiesment
Payyavula Keshav

ఠాగూర్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (10:29 IST)
గత 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒకే ఒక్క ఓటు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌నే మార్చివేసిందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసిందని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిపిందన్నారు. 
 
గతంలో 'ఒక్క ఛాన్స్' అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి వేసిన ఒక్క ఓటు వల్లే రాష్ట్రానికి లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల సంక్షేమం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 'మీరు వేసిన ఓటుతోనే పోలవరానికి రూ.12,500 కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల నిధులు వచ్చాయి. వీటితో పాటు విశాఖకు రైల్వే జోన్, జాతీయ రహదారులకు రూ.70 వేల కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి' అని వివరించారు. 
 
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, లక్ష కోట్ల రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ, ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులు కూడా ప్రజల ఓటు చలవేనని అన్నారు. '16 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ-2024 పూర్తిచేశాం. 'తల్లికి వందనం' కింద 65 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు, 'అన్నదాత సుఖీభవ' ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటివన్నీ ఆ ఒక్క ఓటుతోనే సాధ్యమయ్యాయి' అని తెలిపారు.
 
సూపర్ జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి ఏటా రూ.20 వేలకు పైగా ఆదా అవుతోందని కేశవ్ చెప్పారు. ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఒక బృందం 98 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు, చంద్రబాబు, లోకేశ్ ఆలోచనలతో విశాఖకు గూగుల్ సంస్థ రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చిందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొన్నేళ్లపాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు