వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగుళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయిన తర్వాత వరుసగా బెంగుళూరుకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎనిమిదిసార్లు వెళ్లిన ఆయన తాజాగా తొమ్మిదోసారి వెళ్లడం గమనార్హం. దీంతో జగన్ లండన్ పర్యటనలో అస్పష్టత నెలకొంది.
నిజానికి ఈ నెల 3వ తేదీ నుంచి 25వ తేదీల మధ్య ఆయన లండన్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అలాగే, ఆయన పాస్‌పోర్టు రెన్యువల్ విషయంలో విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
వాటిని రద్దు చేయాలంటూ జగన్ ఏపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సానుకూల తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో లండన్ పర్యటన ఉంటుందా, వాయిదా వేసుకుంటారా అనే విషయంపై స్పష్టత రావడం లేదని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు.