ఏపీలో గత నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున ఏకపక్షంగా విధులు నిర్వహించిన గుడిపాల ఎస్ఐపై వేటుపడింది. చిత్తూరు జిల్లా గుడిపాల ఎస్ఐగా శ్రీనివాస రావు విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పోలింగ్ రోజున ఏకపక్షంగా విధులు నిర్వహించారు. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన ఈసీ 20 రోజుల తర్వాత ఆయనపై వేటు వేసింది.
నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎస్ఐ శ్రీనివాస రావు అధికార వైకాపాకు అనుకూలంగా, వైకాపా కార్యకర్తగా పనిచేశారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే శాసనమన్నట్లుగా భావించి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మే 13వ తేదీన.. పోలింగ్ రోజు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. గుడిపాల మండల కేంద్రంలోని ఓ పోలింగ్ బూత్‌లో వైకాపా ఏజెంటుగా కూర్చున్న శిలంబరసన్ ఫ్యాన్‌కు ఓటేయాలని ఓటర్లకు సూచించారు. దీనిపై టీడీపీ ఏజెంట్ అభ్యంతరం చెప్పినా విన్లేదు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో శిలంబరసన్ ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా, ఆయన అక్కడికి వచ్చీరాగానే క్యూ లైన్లలోని మహిళలపై లాఠీతో విరుచుకుపడ్డారు. తిరగబడిన ఓటర్లు.. ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన విధుల్లో ఉంటే పోలింగ్ సజావుగా జరగదని ఉన్నతాధికారులకు విన్నవించారు. వైకాపా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయానందరెడ్డి, గురజాల జగన్మోహన్ అక్కడికి వచ్చాక పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ మణికంఠ, ఆర్వో శ్రీనివాసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు.
ఎస్ఐ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగిందని ఎన్నికల సంఘానికి, పోలీసు ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. గుడిపాల మండలంలోని పాపిశెట్టిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద సైతం వైకాపా వర్గీయులు టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి చేయగా తెదేపా కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. పేయనపల్లె, 197.రామాపురం పోలింగ్ కేంద్రాల్లోనూ ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐపై అప్పుడే చర్యలు తీసుకోవాల్సి ఉండగా, 20 రోజుల తర్వాత స్పందించి శ్రీనివాసరావుపై ఆదివారం సస్పెన్షన్ వేటువేశారు.