వైకాపా నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారానికి దూరమైనప్పటికీ వైకాపా నేతల బూతులు, బుద్ధి మారడం లేదన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే వ్యవహరిస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పైగా, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారిని క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఏపీలో వైకాపా ఇకపై అధికారంలోకి రాదన్నారు. అందువల్ల వైకాపా నేతలు అధికారంపై ఆశలు పెట్టుకోవద్దన్నారు.
కోనసీమ జిల్లా రాజోలులో నిర్వహించిన పల్లె పండుగ 2.0లో ఆయన పాల్గొన్నారు. అలాగే, శంకరగుప్తం డ్రెయిన్ కారణంగా నష్టపోయిన కేశనపల్లి కొబ్బరి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, వారి గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. కేవలం 22 కోట్ల రూపాయలు ఇచ్చి హడావుడి చేసేందుకు తాను రాలేదన్నారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ వ్యాప్తంగా ఉన్న డ్రెయిన్ల సమస్యపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియజేస్తున్నాం. అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరు అని ఆయన వ్యాఖ్యానించారు.