ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చెప్పులు చూపించి బూతులు తిట్టడమా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లా మన నాయకులు అన్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నామని మండిపడ్డారు.
మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్కాచెళ్లెళ్ల జీవితాలు ఏం కావాలని అడిగారు. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు.
వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరని.. మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటంలో గెలిచేది తామేనని తెలిపారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఎంత మంది ఏకమయ్యారని అన్నారు.