వైద్యం చేయించుకునే స్తోమత లేదు. మా పాపను చేంపేందుకు అనుమతివ్వండంటూ తంబళ్ళపల్లి కోర్టులో కారుణ్య పిటీషన్ దాఖలు చేసిన విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తక్షణం స్పందించారు. చిన్నారి జ్ఞానసాయిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన చికిత్సను ప్రభుత్వం తరపున అందించాలని అదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌కు స్వయంగా ఫోన్ చేసిన సిఎం వెంటనే చిత్తూరు జిల్లా వైద్యాధికారిని జ్ఞానసాయి ఇంటికి పంపి చికిత్స చేయిస్తామన్న హామీని ఇవ్వాలని ఆదేశించారు. జ్ఞానసాయి కథనాన్ని పత్రికలు, టీవీలలో చూసిన సీఎం చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌ఎస్ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల దయనీయ స్థితి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రమణప్ప బెంగుళూరులోని ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సరస్వతి గృహిణి. పేద కుటుంబానికి చెందిన ఈ దంపతులకు పెళ్ళయిన ఏడేళ్లకే ఆడపిల్ల పుట్టింది. పాపకు జ్ఞానసాయి అనే పేరు పెట్టుకుని మురిసిపోయారు. పాపకు పుట్టుకతోనే కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో వీరు తిరగని ఆసుపత్రి అంటూ లేదు. చివరకు పాపకు ఆపరేషన్ చేయాలని 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.
అంతస్తోమత రమణప్ప కుటుంబానికి లేకపోవడంతో పాపను చంపడానికి అనుమతి ఇవ్వండంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య మరణం పిటిషన్ చూసిన న్యాయవాదులు, జడ్జి నివ్వెరపోయారు. ఇది తమ పరిధిలోకి రాదని పైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ఇదే విషయంపై ఆ దంపతులు మీడియా ఎదుట బోరున విలపించారు.
వీరి ఆవేదన మొత్తం గురువారం నుంచి అన్ని మీడియా, పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమయ్యాయి. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పత్రికలు చదువుతున్న చంద్రబాబు నాయుడు జ్ఞానసాయి కథనం చూసి చలించిపోయారు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు. పాప ఆరోగ్య పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండాలని మంత్రిని ఆదేశించారు బాబు.