అది కాస్తా తెలుగు పిలానీగా మారింది... : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : జీవితంలో ఎదగడానికి పేదరికం అడ్డంకి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొప్ప గొప్ప వాళ్లంతా పేదరికం నుంచే వచ్చారని, సాధించాలన్న తపన ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారం
అమరావతి : జీవితంలో ఎదగడానికి పేదరికం అడ్డంకి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొప్ప గొప్ప వాళ్లంతా పేదరికం నుంచే వచ్చారని, సాధించాలన్న తపన ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆరువారాల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. క్రితం ఏడాది ఎంపికైన 22 మందిలో 13 మంది ఏపీ విద్యార్ధులుంటే.. ఈ ఏడాది 53 మందికి గానూ 44 మంది విద్యార్ధులు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోవడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది నాటికి వంద శాతం మంది ఏపీ విద్యార్ధులే ఉంటే మరింత సంతోషిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బిట్స్ పిలానీకి సంబంధించి ఓ సంఘటనను గుర్తు చేశారు. గతంలో బిట్స్ పిలానీకి 70 శాతం మంది తెలుగు విద్యార్ధులు ఎంపిక కావడంతో.. అది కాస్తా తెలుగు పిలానీగా మారిపోయిందని.. దీంతో బిట్స్ పిలానీ వాళ్లు తెలుగు విద్యార్ధులను అడ్డుకోవడం కోసం సిలబస్‌నే మార్చేసినా.. అంతా మనవాళ్లే ఎంపికవుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ విషయంలో భావ వ్యక్తీకరణ సమస్యలేకుండా చూడటం కోసం అనేక ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో లక్ష మందికి ఇంగ్లీష్‌లో శిక్షణ ఇచ్చేలా బ్రిటీష్ కౌన్సిల్‌తో ఎంఓయూ చేసుకున్నామన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనిర్శిటీ శిక్షణ కార్యక్రమానికి వెళ్లిన వారిలో 65 శాతం మంది ఆడపిల్లలుండటం ఆనందించదగ్గ విషయమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళాభివృద్ధి జరిగితే సమాజంలో చాలావరకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో.. 33 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టామన్నారాయన.
ఈ రిజర్వేషన్లను సమర్ధంగా ఉపయోగించుకుని.. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారని.. అన్ని రంగాల్లోనూ మహిళల సంఖ్య 50 శాతం దాటాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద యూనివర్శిటీలన్నీ ఏపీకి వచ్చేలా చేయడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడం ద్వారా.. గ్లోబల్ లీడర్స్‌ను తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను ఎప్పటి నుంచో చెబుతున్న ‘డేర్ టు డ్రీం ట్రై టు అచీవ్’ అన్న నినాదాన్ని పుణికిపుచ్చుకుని.. కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని విద్యార్ధులకు హితబోధ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా.. భారతీయ విద్యార్ధులు.. అందునా తెలుగు విద్యార్ధులు అన్ని రంగాల్లోనూ గొప్పవాళ్లుగా నిలవాలన్నారు. సహజంగానే మనవాళ్లకు ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుందని.. అందుకే అభివృద్ధిలో మనం వేగంగా పురోగమిస్తున్నామని చెప్పారు. జాతీయస్థాయిలో సగటు వృద్ధి రేటుతో పోల్చుకుంటే మన రాష్ట్రం వృద్ధి రేటు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణగా చెప్పారాయన. విభిన్నంగా ఆలోచించడం ద్వారా.. అద్భుతాలు చేయొచ్చన్నారు.
గూగుల్, ఉబర్, అమెజాన్ వంటి సంస్థల్నే ఉదాహరణగా తీసుకుంటే.. భిన్నంగా ఆలోచించడం ద్వారా.. ఆ సంస్థలు విజయవంతమయ్యాయన్నారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో కాస్త భిన్నంగా ఆలోచించడం వల్లే.. పైసా పెట్టుబడి లేకుండా తుఫాను వచ్చిన ప్రాంతంతో పాటు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఎల్‌ఈడీ వీధి లైట్లను అమర్చేలా చేయగలిగామన్నారు. డబ్బుంటే సుఖం గురించి ఆలోచిస్తాం.. అదే డబ్బు లేకపోతే విభిన్న ఆవిష్కరణలు చేయగలుగుతామని.. దీనికి ఉదాహరణే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఫైబర్ నెట్ వ్యవస్థను కేవలం 320 కోట్ల రూపాయలతో పూర్తి చేసి.. 149 రూపాయలకే కేబుల్ ప్రసారాలు, ఇంటర్ నెట్, టెలిఫోన్ వంటి సౌకర్యాలను అందజేయబోతున్నామన్నారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా.. దాన్ని నడిపించాల్సింది మనుషులే కాబట్టి.. వాళ్లు సమర్ధులై.. సమర్ధంగా నడిపిస్తేనే విజయాలు సాధ్యమవుతాయన్నారు. పిల్లల కోసం భూములు కొని ఆస్తులు పోగెయ్యడం కన్నా.. వారిని చక్కగా చదివిస్తే.. అదే వారికి ఆస్తిగా మారుతుందని.. ఈ విషయాన్ని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో శిక్షణకు వెళ్లొచ్చిన విద్యార్ధులు రుజువు చేయబోతున్నారని చెప్పారు. ఎంత చదువుకున్నా.. విలువలు, కుటుంబ అనుబంధాలు, సంస్కృతిని మర్చిపోరాదని విద్యార్ధులకు సూచించారు. మన దేశంలో ఉండే కుటుంబ విలువలు, అనుబంధాలు అమెరికా, చైనా వంటి దేశాల్లో కనపడవని.. అందుకే మనవాళ్లు అత్యంత సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే 2029 నాటికి దేశంలోనే అత్యంత సంతోషంగా ఉండే రాష్ట్రంగా ఏపీని మొదటిస్థానంలో నిలబెట్టాలని భావిస్తున్నానన్నారు. సాధారణ విద్యార్ధుల్ని అసాధారణ విద్యార్ధులుగా మారుస్తున్న విద్యాసంస్థల మేనేజ్ మెంట్లను ముఖ్యమంత్రి అభినందించారు.
మీ సహకారంతోనే సాధ్యమైంది..
ఈ సందర్భంగా ఆయా కాలేజీల నుంచి స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో శిక్షణకు వెళ్లొచ్చిన విద్యార్ధులంతా.. తామేం నేర్చుకున్నదీ, తామేం కావాలనుకుంటున్నదీ ముఖ్యమంత్రికి వివరించారు. తాము స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి శిక్షణ పొందేలా ప్రోత్సహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వల్లనే సాధ్యమైందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన తాము ప్రభుత్వం ఇచ్చిన ఫీజుల రీ ఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లతోనే చదువుకున్నామని.. అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ.. పేదరికం కారణంగా.. మనస్సుల్లోనే ఉండిపోయిన తమ కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే తీర్చుకోగలిగామన్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ఇచ్చిన శిక్షణతో తామంతా పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకుంటున్నామని, తమలాంటి చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ, యువజన సర్వీసులు, ఎన్నారై శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈఓ గంటా సుబ్బరావు పాల్గొన్నారు.