అత్యాచారం, హత్యతో మృతి చెందిన బాలిక తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 5 లక్షల సాయం
అభంశుభం తెలియని వయసులో కామాంధుడి కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఓ పసికందు తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకున్నారు.
అభంశుభం తెలియని వయసులో కామాంధుడి కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఓ పసికందు తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే ఓ దుర్మార్గుడి కామ దాహానికి బలైన బాలిక తల్లిదండ్రుల దుస్థితిని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో చలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మానవతా దృక్పథంతో స్పందించారు.
బాలిక తల్లిదండ్రులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఆ మేరకు చెక్కును ఉండవల్లిలోని ప్రజావేదికలో బాలిక తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామ పరిధిలో గత మార్చిలో అంగన్‌వాడి పాఠశాలకు వెళ్ళి వస్తున్న సమయంలో చాక్లెట్ ఇచ్చి మాయమాటలు చెప్పి నాలుగేళ్ల వయసు బాలికను పొలాల్లోకి తీసుకెళ్ళి కేతాపట్నాయక్ అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత నిర్దాక్షిణ్యముగా ఆ బాలికను చంపి తుప్పల్లో పడేశాడు. ఈ విషయం తెలిసి నన్నపనేని రాజకుమారి ఆ గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. ఆ తల్లిదండ్రుల ధైన్య స్థితిని తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. వారికి ఆర్ధిక సాయం చేయాలన్న నన్నపనేని విజ్ఞప్తిని మన్నించిన ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంజయ్య, గంగలను ముఖ్యమంత్రి వద్దకు నన్నపనేని, మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కె. చలమారెడ్డిలు తీసుకువచ్చారు. ఆ మేరకు సిద్ధం చేసిన రూ. 5 లక్షల చెక్కును ముఖ్యమంత్రి ఆ బాలిక తలిదండ్రులకు అందజేశారు.