టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి దేశ రాజధానిలోనే బస చేసే ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గత దశాబ్దకాలంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. అలాగే, ఇతర రాజకీయ అంశాలతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు... విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు.
కాగా, ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే ఉండి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెల్సిందే. ఇపుడు మళ్లీ కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీకి వెళ్లనుండటం గమనార్హం. ఇదిలావుంటే, మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులందరూ పాల్గొననున్నారు. ఈ సమావేశం ముగించుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.