Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పౌష్టికాహారంతోనే రక్తహీన‌త నివారణ : నీలం సాహ్ని

పౌష్టికాహారంతోనే రక్తహీన‌త నివారణ : నీలం సాహ్ని
, శుక్రవారం, 29 నవంబరు 2019 (16:09 IST)
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిలో రక్తహీనతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలుపై ఆశాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు బాలసంజీవని, బాలామృతం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా విటమిన్ ఎ, ఐఎఫ్ఏ, కాల్షియం మాత్రలు గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా మింగేలా చూడాలని చెప్పారు. ఆసుపత్రి ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మాతా, శిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆశాఖ అధికారులను ఆదేశించారు. 
 
అలాగే రాష్ట్రంలోని 77 గిరిజన ప్రాంత మండలాల్లో అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ చెప్పారు. అనంతరం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సమీక్షిస్తూ ఎన్ని అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలున్నాయి, ఎన్ని అద్దెభవనాల్లోను, అద్దెలేని భవనాల్లో ఎన్ని కేంద్రాలు నిర్వహించబడుతుందీ ఆరా తీశారు. గర్భిణీలు, బాలింతలకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహనను కలిగించేందుకు ప్రత్యేకంగా కరపత్రాలు, బుక్ లెట్లు ముద్రించి పెద్దఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు. 
 
ఇంకా మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి ఈ సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని విస్తృతంగా సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాఖాప‌రంగా అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుతీరును సిఎస్‌కు వివరించారు. సమావేశంలో శాఖ సంచాలకురాలు కృతికా శుక్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డంపింగ్ యార్డును సింగ్‌నగర్ నుండి తరలిస్తాం... మంత్రి బొత్స