Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ కేబినెట్ విస్తరణ డేట్ ఫిక్స్! ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం!!

విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (16:07 IST)
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు వైసీపీ తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. ఈ ఎన్నికలు సైతం ఏకగ్రీవమనే వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 
ఇక ఎన్నికలు జరుగుతున్న ఎనిమిది జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజార్టీ ఉండటంతో అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఒక వేళ టీడీపీ పోటీ పెడితే పోటీ తప్పదు. అయినా అంతిమ విజ‌యం వైసీపీదే అని చెపుతున్నారు. 
 
 
జగన్ కేబినెట్ లోని ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. నాడు మంత్రి పదవులు ఖరారు చేసే సమయంలోనే రెండున్నరేళ్ల తరువాత 90 శాతం వరకు మంత్రుల మార్పు ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇప్పుడు మొత్తం కేబినెట్ లోని మంత్రులను మార్చాలని నిర్ణయించార‌ని తెలుస్తోంది. పాత మంత్రులను తప్పించి, కొత్త వారిని తీసుకుంటారనే విషయం నిర్ధారణ అయిన సమయం నుంచి కొంత మంది మంత్రులు గతంలో లాగా యాక్టివ్ గా కనిపించటం లేదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.
 
 
ముఖ్యమంత్రి జగన్ సైతం పార్టీ - ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో నిఘా సంస్థతో పాటుగా ప్రయివేటు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి, ఈ సారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
 
 
స్థానిక ఎన్నికలు అన్నీ కూడా పూర్తి కావటంతో, వ‌చ్చే సార్వత్రిక ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా కేబినెట్ విస్తరణ పైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్యనేతల వద్ద చర్చ జరుగుతోంది. అందు కోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీసినట్లు చెబుతున్నారు. దీంతో రెండు డేట్లు పార్టీలో ప్రచారంలో ఉన్నాయి.  
 
 
డిసెంబర్ 5 న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని, ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ డేట్ పై ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా, ఆ డేట్ కే ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులు తాము మంత్రులుగా సాంకేతికంగా రెండున్నరేళ్ల పాటు ఉన్నా, కరోనా కారణంగా పనిచేసే అవకాశం పూర్తిగా రాలేదని చెబుతున్నారు. 
 
 
మరో ఆరు నెలల కాలం తమకు సమయం ఇవ్వటం ద్వారా సమర్ధత నిరూపించుకుంటామనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఆరు నెలలు పొడిగించి, ఎన్నిలకు ఆరు నెలల కాలం ముందుగానే ప్రభుత్వ పాలన ఆగితే, దీని ఫ‌లితం ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇప్ప‌టి నుంచి పూర్తిగా ఎన్నికల పైన ఫోకస్ చేస్తే, బెట‌ర్ అని పేర్కొంటున్నారు. సీనియ‌ర్లు చెప్పిన‌ట్లు ఆరు నెల‌లు ఆగితే, ఇక కొత్త మంత్రులు ఏడాది పాటు మాత్రమే పని చేసే అవకాశం ఉంటుందని, దీనిని ఎలా అంగీరిస్తారనే వాదన సైతం వినిపిస్తోంది. కేబినెట్ ప్రక్షాళన ఖాయమని చెబుతున్నా, ఎప్పుడనేది మాత్రం సీఎం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.
 
 
కానీ, వ‌చ్చే కొత్త క్యాబినేట్ మాత్రం పక్కా సమీకరణాలతో కూర్పు ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇప్పటికే సామాజిక- ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త కేబినెట్ పైన లెక్కలు పూర్తయినట్లు చెబుతున్నారు.  
ఇక, సీనియర్లకు పార్టీ తరపున కొత్త కమిటీ ఏర్పాటు చేసి, వారికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యతలు నిర్వహణ అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న సీఎం జగన్, ఇక, మరింత వేగంగా పార్టీలో, ప్రభుత్వం త‌ర‌ఫున అడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 
 
 
దీనికి అనుకూలంగా వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, వైసీపీ రాజకీయాల్లో మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త క్యాబినేట్ కూర్పుతోపాటు, ప్రజల్లోకి ముఖ్యమంత్రి, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం, పధకాల నిర్వహణ తనిఖీలు వంటివి చేయటం ద్వారా సానుకూలత పెంచుకొనే ప్రయత్నాలు చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం లేదా,  రెండో ముహూర్తంగా డిసెంబర్ మూడో వారంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడు... పట్టాభి ఫైర్