Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నల్ల చొక్కాలతో రానున్న తెదేపా

16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నల్ల చొక్కాలతో రానున్న తెదేపా
, సోమవారం, 15 జూన్ 2020 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఒకవైపు కరోనా భూతం పట్టిపీడిస్తున్న సమయంలో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాలు రెండ్రోజుల పాటు జరుగనున్నాయి. 
 
అయితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించింది. అయితే, నల్ల చొక్కాలు ధరించి సభలోకి అడుగుపెట్టాలని మంగళవారం జరిగిన టీడీపీఎల్పీ సమావేశంలో జరిగింది. 
 
ఈ సమావేశాల్లో అక్రమ అరెస్టులు, ఇసుక అక్రమాలు, మద్యం ధరల పెంపు, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని టీడీపీ భావిస్తోంది. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టుపై టీడీపీ సభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. 
 
కాగా, అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభంకానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఆన్‌లైన్‌లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. ఎన్నిరోజులు సభ జరపాలన్నది బీఏసీ నిర్ణయించనుంది. 
 
రేపటి సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో బలంగా వినిపించాలని వైసీపీ సభ్యులు నిశ్చయించుకున్నారు. 
 
ఇక కరోనా నేపథ్యంలో, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కరోనా టెస్టులు చేయించుకున్నారు. 
 
ప్రత్యేక వ్యూహంతో తెదేపా 
అయితే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్బంగా టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, ఎల్జీ పాలిమర్స్ ఘటన, మద్యం ధరలు, ఇసుక మాఫియా తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీఎల్పీ నిర్ణయించింది. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై గవర్నరును కలిసి వినతి పత్రాన్ని అందించాలని కూడా నిర్ణయించారు.
 
మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం సెషన్‌లో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై స్వల్పకాలిక చర్చను జరిపి... తొలిరోజు సమావేశాలను ముగిస్తారు. 
 
రెండో రోజు (17వ తేదీ) కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి, వాటిపై స్వల్ప చర్చ జరిపి, వాటిని ఆమోదిస్తారు. ఆ వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. మరోవైపు, సమయం తక్కువగా (రెండు రోజులే) ఉండటంతో... సభ ఎలా జరుగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 
 
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం యత్నిస్తుంది. వాగ్వాదం ఎక్కువైతే నిర్ణీత సమయంలోగా బిల్లులను ఆమోదించుకోవడం కష్టమవుతుంది. దీంతో, ప్రతివ్యూహాలతో ప్రభుత్వం కూడా సిద్ధమవుతోందని తెలుస్తోంది. అవసరమైతే, టీడీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదనేది విశ్లేషకుల అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక్కడ పని దొరకక పస్తులుండరెవ్వరూ : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు