మరో రెండు రోజుల్లో మరో వాయుగుండం పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 'గులాబ్' తుపాను తీవ్ర వాయుగుండంగా సోమవారం ఉదయం 11.30 గంటలకు బలహీనపడిన విషయం తెలిసిందే.
దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలంకు 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే ఆరు గంటల్లో బలహీనపడి, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది.
తదుపరి ఈశాన్య అరేబియా సముద్రం దీన్ని ఆనుకుని ఉన్న గుజరాత్ తీరం వైపు ప్రయాణం చేయనుంది. 30న ఈశాన్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంటుంది.
ఈ తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాలో అన్ని చోట్లా, దక్షిణ కోస్తాలో కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఎపి తీరంలో గాలుల తీవ్రత గంటకి 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నారు.