తెలుగుదేశం పార్టీ హయాంలో చింతమనేని ప్రభాకర్ ఒక డైనమిక్ ఎమ్మెల్యే. అధినేత చంద్రబాబునాయుడుతో బాగా సన్నిహితంగా ఉండటమే కాకుండా తన నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరు సంపాదించుకున్నారు చింతమనేని ప్రభాకర్. సార్వత్రిక ఎన్నికలకు ముందు చింతమనేని ప్రభాకర్ వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్సల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎమ్మార్వోపై దాడి.. నియోజకవర్గంలోని దళితులను హేళనగా మాట్లాడటం వంటి ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఎన్నో వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి.
అయినాసరే అప్పట్లో చింతమనేని ప్రభాకర్ పైన ఎలాంటి కేసులు పెట్టలేదు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 18 కేసులతో చింతమనేనిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒకవైపు ఎస్సి, ఎస్టి కేసు మరోవైపు బెదిరింపులు, దౌర్జన్యం కేసులు ఇలా చింతమనేనికి చుక్కలు చూపించారు. ఏకంగా 67 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చారు చింతమనేని.
గత రెండురోజుల ముందే జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇక జైలుకు వెళ్ళడం కన్నా బయట నుంచే సైలెంట్ ఉండిపోదామనుకున్నారు చింతమనేని. స్వయంగా అధినేత చంద్రబాబునాయుడు చింతమనేని వద్దకు వెళ్ళి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అయితే ఇదంతా జరుగుతుండగానే చింతమనేనిపై మరో కేసు నమోదైంది.
తనను చింతమనేని కులం పేరుతో బెదిరించాడంటూ ఒక వ్యక్తి మళ్ళీ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు చేశారు. చింతమనేనిని అస్సలు బయట తిరగనివ్వకుండా అధికార వైసిపి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని ఆయన అభిమానులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.