Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

పక్కపక్కనే ఉన్న అక్షరాలు కాదు.. ముఖ్యమంత్రులు... కానీ ఎంత తేడా!

పక్కపక్కనే ఉన్న అక్షరాలు కలుసుకోవడానికి పాతికేళ్లు పట్టిందా అనేది త్రివిక్రమ్ సినిమాలోని పేరు మోసిన డైలాగ్. అలాగే వాళ్లు పక్కపక్కన ఉన్న అక్షరాలు కాదు కానీ.. పక్కపక్కనే ఉన్న ముఖ్యమంత్రులు. కాని ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో, వాటిని నెరవేర్చడానికి శరవే

Advertiesment
andhrapradesh
హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (04:35 IST)
పక్కపక్కనే ఉన్న అక్షరాలు కలుసుకోవడానికి పాతికేళ్లు పట్టిందా అనేది త్రివిక్రమ్ సినిమాలోని పేరు మోసిన డైలాగ్. అలాగే వాళ్లు పక్కపక్కన ఉన్న అక్షరాలు కాదు కానీ.. పక్కపక్కనే ఉన్న ముఖ్యమంత్రులు. కాని ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో, వాటిని నెరవేర్చడానికి శరవేగంగా చర్యలు చేపట్టడంలో ఆ ఇద్దరిమధ్య ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ ఇద్దరు సీఎంలు ఎవరో కాదు. ఒకరు పన్నీర్ సెల్వం. మరొకరు చంద్రబాబు నాయుడు. ఒకరిది తమిళనాడు.. మరొకరిది ఆంధ్రప్రదేశ్.
 
తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఇటీవలి జల్లికట్టు కావచ్చు. నేటి ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా హక్కు కావచ్చు.. ఇవన్నీ జాతి ప్రజల ఆకాంక్ష. తమ ఉనికికి, తమ గౌరవానికి, తమ జీవితానికి సంబంధించిన హక్కుల విషయంలో ఈ మూడు ఎంత సంచలనాత్మక ప్రభావం వేశాయో అందరికీ తెలుసు. ఈ మూడూ అస్తిత్వ సమస్యల్లో భాగం. వీటిలో తొలి రెండూ ఇప్పటికే సాకారం కాగా.. చివరిదైన ప్రత్యేక హోదా అటు కేంద్రం చేతిలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో నమ్మక ద్రోహానికి గురై పడి లేస్తూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.
 
అయిదేళ్లు చాలదు.. పదేళ్లూ సరిపోదు.. పదిహేనేళ్లపాటు ప్రత్యేకహోదా కావాలి. సాధించి తీసుకొస్తా అన్న ముఖ్యమంత్రి జావగారిపోయిన క్షణాల్లో హోదాకు చిల్లుపడింది. రాజకీయ స్వార్ధంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బ్రహ్మాండం అంటూ చూపించి భ్రమలు చేతిలో పెట్టారు. అందుకే, ప్యాకేజీ ప్రకటించి చాలా రోజులైనా ప్రత్యేక హోదా ఇప్పటికీ ఓ బడబాగ్నిలా రాజుకుంటూనే ఉంది. ఎవరు దానికోసం ముందుకెళ్లినా ప్రజలు వారి వెనుక వస్తున్నారు.. ఎందుకంటే అందులో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఉంది.. ఆశలు ఉన్నాయి.. కలలు ఉన్నాయి.
 
సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కును ఇస్తున్నామని ప్రకటించగా పదేళ్లు ఇవ్వాలని నాటి బీజేపీ కోరింది. ఆ మాట ప్రకారం దానిని నెరవేర్చి తీరాలి. ఒక వేళ కేంద్రం అలా నెరవేర్చనప్పుడు రాష్ట్రంలోని పాలకుడు దానిని అమలుచేయించుకునేందుకు శంఖం పూరించాలి. విజయం సాధించాలంటే ప్రజలను తీసుకెళ్లాలి.. ఉద్యమం చేసిన ప్రజలుగానీ, వారితో కలిసి పనిచేసిన నాయకుడుగానీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఇది తెలంగాణ విషయంలో, జల్లికట్టు విషయంలో స్పష్టమైంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది.
 
జల్లికట్టు ఉద్యమానికి సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి దాదాపు సారథ్యం వహించినంత పనిచేసి విజయాన్ని అందుకోగా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు వేరు నేను వేరు.. నాకు ఏపీ ప్రజలకు సంబంధం లేదు.. అది వారి డిమాండే తనకు సంబంధించింది కాదు.. తన రాజ్యంలో ఎవరూ ఆందోళన చేసినా అదిమేస్తాం.. చిదిమేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేనప్పుడు ప్రజల సహాయంతో తన గొంతు వినిపించాల్సిన ముఖ్యమంత్రి మొత్తం ఏపీ గొంతును నొక్కేసే పనిచేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరుస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బలగాలను, పోలీసులను ఉద్యమాలను అణిచేందుకు ఉపయోగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలిసి తిరిగి అదే పనిచేస్తున్నారు.
 
వాస్తవానికి ప్యాకేజీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలకు జల్లికట్టు పెద్ద మంచి స్ఫూర్తిని రగిలించింది. గతంలో ఒకే ఒక్క ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదాకోసం తీవ్రంగా శ్రమించినా చివరికి దాని ఆవశ్యకత గుర్తించి నేడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తాము సైతం అంటూ ముందుకు కదిలాయి. యువత కూడా బలమైన ముందడుగేసింది. ఈ సమయాన్ని ఉపయోగించుకోని కేంద్రానికి ప్రజల అభీష్టాన్ని బలంగా చెప్పాల్సిన ముఖ్యమంత్రి బలగాలను నమ్ముకొని ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితి సృష్టించారు. 
 
ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఈ తీరు చూస్తుంటే ఆయన కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారాడని, అందుకు ఆయన చేసిన తప్పులే కారణం అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కడి మేలు కోసం చూస్తే మొత్తం ఏపీ ప్రజల భవిష్యత్తు వేగం నెమ్మదిస్తుంది. ఆయన స్వార్థం విడిచి ప్రజలతో కలిసి ముందుకెళితే మొత్తం తెలుగు సమాజం గర్విస్తుంది. కానీ, ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తారో ఆయన తెలుసుకోవాలి. 
 
చదువుకుంటున్న వందలాదిమంది పిల్లలపై కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టి పాలన చేయాలనుకుంటున్న పాలకులు గత చరిత్ర పాఠాలను అంత సులభంగా మర్చిపోతున్నారా.. తెలంగాణ అనుభవం చూసి కూడా జ్ఞానోదయం కలగకపోతే ఎలా? ఏ అస్తిత్వ పోరాటమైనా ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు సంబంధించిన విషయం. అవి నేరవేరేంతవరకు అడ్డంకులు ఎదురుకావచ్చు కానీ  అంతిమంగా వాటి సాఫల్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు. పాలకులకు ఈ  విషయం అర్థం కావడంలేదా, లేక అర్థం కానట్లు నటిస్తున్నారా? 
 
సమీప భవిష్యత్తు చెప్పవలసిన విషయం ఇది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుజనాపై నెటిజన్లకు ఇంత కోపం ఉందా?