andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయి భానుడు భగభగమంటున్నాడు. దీనితో ప్రజలు ఎండలకు అల్లాడుతున్నారు. ఏపీలో శనివారం అత్యధికంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రత, వైఎస్ఆర్ జిల్లా అట్లూరులో 42.3, పల్నాడులో 41.6, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 41.5, చిత్తూరు నగరిలో 41.4, నెల్లూరు జిల్లా జలదంకిలో 41.3, నంద్యాల జిల్లా పాములపాడులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బ తగిలితే...
వేసవి ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము.
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
మజ్జిగ తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు.
శరీరంలో నీటిశాతం తగ్గకుండా వుండేందుకు పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.