ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టెన్షన్ నెలకొంది. అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. ఈ నెల 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తేదీన ఫలితాలు ఉంటాయి. ఇటీవలే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసాయి. కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయించి అన్ని పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే.
ఏ గ్రామపంచాయతీల్లో అయితే ఎన్నికలు జరగలేదో ఆ గ్రామ పంచాయతీల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 372 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు గడువు ఉన్నది. మార్చి 7 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, 8 వ తేదీన నామినేషన్ల పై ఫిర్యాదుల స్వీకరణ, 10 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి. 13వ తేదీ సాయంత్రం 7:30 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవచ్చు. మార్చి 15 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు ఉంటాయి.