ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ప్రణాళిక, ఆర్థిక వనరులు, విద్య, వ్యవసాయం, ఆరోగ్య పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై రాజ్‌భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి సంయజ్ గుప్తా నూతన గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిసి వివరించారు. ప్రత్యేకించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. అమలు చేస్తున్న నవరత్నాలు పథకాల గురించి వివరించారు.
నవరత్నాలు పథకాలు వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్ ఆ పథకాలు దేశంలోనే వినూత్న పథకాలని, పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ పథకాల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక కృషిని అభినందించారు. రాష్ట్ర ఆర్థిక వనరుల గురించి వివరిస్తూ, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారిత రాష్ట్రమని ప్రణాళిక కార్యదర్శి సంయజ్ గుప్తా గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు తుఫాను మరియు కరువు బాధిత ప్రాంతాలని వివరించారు.
గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న వర్షాభావ ప్రభావం కూడా రాష్ట్ర ఆర్ధిక వనరులపై ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఈ సంవత్సరం 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లుగా తెలిపారు. దేశంలోనే అత్యాధునిక ఆటోమేటెడ్ వెదర్ మానిటరింగ్ సిస్టం ద్వారా వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేస్తున్నట్లుగా చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి గవర్నర్ ప్రత్యేకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పథకం ఏ వర్గాల ప్రజలకు వర్తిస్తుంది, ఈ పథకం ద్వారా పొందే సదుపాయాల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్ కార్యక్రమం ద్వారా ప్రజల ఇంటి వద్దకే అత్యవసర వస్తువుల పంపిణీ, గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పరిపాలనను ప్రజల చెంతకు తీసుకువెళ్లడం, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అభ్యర్థనలను తీసుకుని, నిర్ణీత గడువులో వాటిని పరిష్కరించడం, పిల్లలను బడికి పంపడానికి తల్లికి ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదలగు కార్యక్రమాలు దేశంలోనే వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా గవర్నర్ అభివర్ణించారు.