ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి నిర్మాణం కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు., ఎక్కడ ఎంత మొత్తంలో ఖర్చు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో రెండో రోజైన గురువారం విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటీషన్‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటివరకూ 52 వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 'నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది?' తదితర వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా... అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే, ఇప్పటివరకు ఎన్ని భవనాలు పూర్తయ్యాయి.? ఎక్కడ ఆగిపోయాయి...? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..? వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా... ఆ నష్టం ఎవరు భరిస్తారని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఈ అంశంపై రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా, రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బులను ఎక్కడ నుంచి తీసుకువచ్చారు?.. 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదావేసింది.