Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టులో నిమ్మగడ్డ వాదన

ఆ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టులో నిమ్మగడ్డ వాదన
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (15:05 IST)
తన పదవి నుంచి తొలగించేందుకే అత్యవసరంగా తన పదవీ కాలాన్ని ఆరేళ్ళ నుంచి మూడేళ్ళకు కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారని ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. పైగా, ఈ ఆర్డినెన్స్‌ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనదని, దురుద్దేశపూరితమైనదని తెలిపారు. అంతేకాకుండా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఆర్డినెన్స్‌ తెచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలు పూర్తిగా అవాస్తమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు, సర్వీసు నిబంధనల సవరింపు, నూతన ఎస్‌ఈసీ నియామకం తదితరాలకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దానికి నిమ్మగడ్డ ఆదివారం రిప్లయ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు.
 
'ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకుంది. దీనికి సంబంధించి ఏ ఒక్క కమిటీ గానీ, నిపుణుల బృందంగానీ అధ్యయనం చేయలేదు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావడానికి ఎలాంటి కారణం లేదు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఎప్పుడో జరిగిన లోపాలపై రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఇప్పుడు సాకుగా చూపుతూ, నన్ను తొలగించాలన్న దురుద్దేశంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఎస్‌ఈసీ తటస్థంగా వ్యవహరించడం కోసమే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని చెప్పడాన్ని బట్టి.. నన్ను తొలగించాలన్న లక్ష్యంతోనే ఆ పనికి పూనుకుందని తేటతెల్లమవుతోంది' అని నిమ్మగడ్డ వివరించారు. 
 
తన నేతృత్వంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని చెప్పడం ద్వారా తనపై నిరాధార నిందలు మోపారని.. తనను దురుద్దేశంతోనే తొలగించారని, ప్రత్యక్షంగా తొలగించలేక, ఆర్డినెన్స్‌ ద్వారా లక్ష్యం నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు. తనను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. గవర్నర్‌కు పరిమిత శాసనాధికారాలున్నాయని, వాటిని దుర్వినియోగపరచడానికి వీల్లేదని తెలిపారు.
 
అంతేకాకుండా, 'రాజ్యాంగం ప్రకారం ఎస్‌ఈసీ పదవీ కాలానికి రక్షణ ఉంది. దానిని కుదించడం సరికాదు. అసెంబ్లీలో చర్చించకుండా ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సైతం గతంలో చెప్పింది. జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ముందున్న పరిస్థితిని కొనసాగేలా ఆదేశించండి' అని నిమ్మగడ్డ హైకోర్టును అభ్యర్థించారు. కాగా, ఎస్‌ఈసీ వ్యవహారంలో నిమ్మగడ్డతో పాటు మరో 11 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు... తదుపరి విచారణనను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యోగి ఆదిత్యనాథ్ తండ్రి మృతి.. కడసారి చూపుకు నోచుకోని సీఎం