ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలో దాటేశాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో శుక్రవారం వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తలు నిర్వహణ శాఖ తెలిపింది.
ఈ మేరకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు అప్రమత్తత హెచ్చరికలను పంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 83 మండలాల్లో తీవ్ర వడగాలులు 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచన చేసింది.