రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పోలీసులు చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అభియోగపత్రాన్ని ఏసీబీ కోర్టులో దాఖల చేసింది. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు నాయుడుపై సీఐడీ గత 2020లో కేసు నమోదు చేసింది. చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు.
అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరోకేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. 2022లో మాజీమంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగులో ఉంది.