ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది.
ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించనుంది.
సభ ప్రారంభమైన వెంటనే ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అలాగే, ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.