ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వారం లేదా పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ కూటమి ప్రభుత్వం అనతపురం వేదికగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి రెట్టింపు ఉత్సాహంతో ఈ సమావేశాలకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైకాపా మాత్రం గతంలో తరహాలోనే ఈ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలని భావిస్తోంది. పైగా, తమ పార్టీ అధినేతకు విపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మంకుపట్టి పట్టింది.
మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సూపర్-6 పథకాలతో పాటు పీ-4, రాష్ట్రంలో పెట్టుబడులు - పరిశ్రమల స్థాపన, డీఎస్సీతో 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి 20కి పైగా అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని టీడీపీ ప్రతిపాదించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం సమీక్షించారు.
స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ్యుల హక్కులకు భంగం అంశంపై ఛైర్మన్ మోషేను రాజు అధికారులతో చర్చించారు. ఎమ్మెల్సీలకు సంబంధించి 20, ఎమ్మెల్యేలవి 7 ఫిర్యాదులున్నాయని తెలిపారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, ప్రొటోకాల్‌ను విధిగా పాటించేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేయాలని సీఎస్ ను ఆదేశించారు.