Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ ఎల్పీ భేటీ.. గవర్నర్ ప్రసంగం

ap assembly

వరుణ్

, సోమవారం, 22 జులై 2024 (09:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.
 
కాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు శ్వేత పత్రాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను సభ ముందు ఉంచనుంది. మరోవైపు గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇక ఢిల్లీలో బుధవారం నిరసన తెలపాలని నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం నాటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఢిల్లీకి రావాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు.
 
ఇదిలావుంటే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. అసెంబ్లీ భవనంలో టీడీఎల్పీ భేటీ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభంకానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
 
కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ స్పష్టం చేసింది. అటు, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నేతలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి దారిలో పెడతాం : జనసేన నేత నాగబాబు