అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆయనపై హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్న విషయం తెల్సిందే. దీంతో సీబీఐ కోర్టు తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉంటున్నందున కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో రెండుసార్లు జగన్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు వాటిని కొట్టేసిన విషయం తెలిసిందే. పైగా, జనవరి 31న జరిగే విచారణకు తప్పకుండా ఏ1గా ఉన్న జగన్ హాజరుకావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. కానీ, ఆయన హాజరుకాలేదు.
అయితే సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందునే జగన్ కోర్టుకు హాజరు కాలేదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే, ఈ కేసులో ఏ2గా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు హాజరుకాలేదు. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సమావేశాల్లో విజయసాయిరెడ్డి కూడా పాలుపంచుకుంటున్నారు. దీంతో ఆయన హాజరుకాలేదు. ఈయన కూడా బెయిలుపై ఉన్న విషయం తెల్సిందే.