తనను ప్రశ్నించిన ఓ మహిళకు వైకాపా నేత, ఏపీ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఒంటికాలిపై లేశారు. నన్నే నిలదీస్తావా.. నీకెంత ధైర్యం.. నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో.. అంటూ ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో మంగళవారం 'గడపగడపకు మన ప్రభుత్వం'లో తమ్మినేని పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్తూ టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి నర్సింగరావు కుటుంబసభ్యులు ఉన్న ఇంటికి వెళ్లకుండా ముందుకు సాగారు.
నర్సింగరావు మరదలు శెట్టి పద్మ తమ సమస్యలు చెప్పుకోవాలని అప్పటికే ఇంటి ముందు నిల్చోగా, స్పీకర్ వెళ్లిపోవడాన్ని గమనించారు. వెంటనే ముందుకెళ్లి తన అత్త పింఛను సమస్యను స్పీకర్‌కు తెలపగా, పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
అనంతరం తనను ఏ కారణంగా ఆరు నెలల క్రితం అంగన్‌వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించారని ప్రశ్నించారు. వెంటనే చిర్రెత్తిపోయిన స్పీకర్ తమ్మినేని.. 'ఆ సంగతి నాకు తెలుసు. నీ ఇష్టమొచ్చిన దగ్గర చెప్పుకో పో' అంటూ మండిపడ్డారు.
ఆమె స్పందిస్తూ 'ఇక్కడ అన్ని సంక్షేమ పథకాలకూ లంచాలే. ఒక్కో పథకానికి రూ.3 వేలు లంచమివ్వాలి. ఓ అంగన్‌వాడీ టీచర్‌ను తప్పు చేయకుండా తీసేయడమేంటి? అడిగితే, దిక్కున్నోడికి చెప్పుకోమంటారా? స్పీకర్ భాషేనా ఇది? ఇదా మీ సంస్కారం? ఈ వీడియో సీఎం జగన్‌కు పెట్టండి. ఇంటింటికీ వచ్చిన స్పీకర్.. మా ఇంటికి రాకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగితే ఇంత కోపమా? ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సంగతి తేలుస్తాం' అంటూ పద్మ బదులిచ్చారు.