పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ జీవితంలో ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని జోస్యం చెప్పారు. వాలంటరీ వ్యవస్థపై పవన్‌కు వున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వాలంటీర్లు చేసే పని పవన్‌కు తెలుసా అని నిలదీసారు.
ఏపీలో జగన్ పాలనలో ప్రజలకు పింఛన్లు ఎలా అందుతున్నాయో తెలుసుకోలేని అజ్ఞాని పవన్ కల్యాణ్ అంటూ అంబటి ఫైర్ అయ్యారు. జగన్ పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కి అడుగు దూరంలోకి కూడా పవన్ రాలేడని హెచ్చరించారు.
అంతేగాకుండా పవన్ కల్యాణ్ చంద్రబాబుని సీఎంని చేయలేడని, వైయస్ జగన్ మళ్లీ జెండా ఎగరేస్తాడనే భయంతో దుష్టచతుష్టయం అల్లాడిపోతుందని అంబటి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవహించిందని ఎద్దేవా చేశారు. పవన్ ఏకపత్నీవ్రతుడు అంటూ అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు.
ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో పవన్ ఇప్పుడు మాట్లాడుతున్న తరహాలోనే వైయస్ రాజశేఖరరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మూల్యం చెల్లించుకున్నారని గుర్తు చేశారు.