Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి వాస్తు బాగుంది... మహిళలకు సంపూర్ణ మద్దతు: చంద్రబాబు

సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు సదస్సులో ఆయన ప్రసంగించారు. స

Advertiesment
Amaravati vastu super
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (15:31 IST)
సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన  జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాన అవకాశాల ఉంటే తప్ప మహిళలు ఎదగలేరన్నారు. అందరి సహకారం తీసుకొని మహిళలకు సమాన అవకాశాలు వచ్చేవరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మూడు రోజులపాటు చరిత్రాత్మకంగా జరిగిన ఈ సదస్సు లక్షలాదిమంది మహిళలకు ప్రేరణగా నిలిచిందన్నారు. 
 
రెండు నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో ఈ సదస్సు జరగడం అపూర్వం అన్నారు. ఈ సదస్సుకు అద్వితీయ స్పందన లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పది వేల మంది వస్తారనుకుంటే 22 వేల మంది వచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి స్పూర్తి పొందారని చెప్పారు.  జనాభాలో 50 శాతం పైగా మహిళలు ఉన్నారని, లింగ వివక్ష అనేది నిన్నటి మాట అని, లింగ సమానత నేటి నినాదం అన్నారు. విజ్ఞానంలో గానీ, ఆర్థిక విషయాల్లో గానీ, రాజకీయాల్లో గానీ ఏ అంశంలోనూ మహిళలు తక్కువ కాదని చెప్పారు. మహిళలు ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ, అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు ఇచ్చారు. 
 
సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని ఈ మహిళా పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని చెప్పారు. మహిళా బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ముందుండి దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కోరారు.
 
ఈ సదస్సు సందర్భంగా ఇక్కడ జరిగిన 54 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఉన్నత విద్య, న్యాయం, పౌష్టికాహారం, మహిళా శక్తి, సామాజిక అభివృద్ధి, పార్లమెంట్ వంటి అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఇక్కడ చర్చించిన అన్ని అంశాలు అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధికల్పనలో లింగవ్యత్యాసం చూపకూడదన్నారు. కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఇళ్లల్లో మహిళలను గౌరవించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించిందన్నారు. 60 కోట్ల మందిని ఆకట్టుకుందని చెప్పారు. మహిళా సాధికారిత అంటే ఏమిటని అడిగితే 25.90 శాతం మంది మహిళలను గౌరవించడం అని చెప్పినట్లు తెలిపారు. 
 
తల్లికి వందనం
ఇండోనేషియా, ఫిన్లాండ్ వంటి దేశాలలో ఏడాదిలో ఒక రోజు తల్లికి కేటాయించి గౌరవిస్తారని, అది ఎంతో మంచి సంప్రదాయమన్నారు. త్వరలో మన రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున ‘తల్లికి వందనం‘ అనే పేరుతో  ప్రకటిస్తామని చెప్పారు. ఆ రోజు ప్రతి పాఠశాలకు తల్లులను పిలిపించి విద్యార్థినీ విద్యార్థులు వారి వారి తల్లుల పాదాలు కడిగి, వారిని గౌరవించేవిధంగా కార్యక్రమం రూపొందిస్తామన్నారు. అందరూ తల్లులను గౌరవించిననాడే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించగలుగుతారని చెప్పారు.  మహిళలను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే మొదలుకావాలని పిలువు ఇచ్చారు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. మహిళలను గౌరవించిననాడే ఏ సమాజమైనా అభివృద్ధి చెందుతుందన్న స్వామి వివేకానంద మాటలను గుర్తు చేశారు. ఒక్క కాలితోగానీ లేక బలహీనంగా ఉన్న కాలితో గాని పక్షి ఎలా ఎగరలేదో అలాగే మహిళలను గౌవించని దేశం కూడా అభివృద్ధి చెందలేదని వివేకానందుడు ఆనాడే చెప్పారన్నారు. 
 
సదస్సు నిరంతర ప్రక్రియ
ఈ పార్లమెంట్ అనేది ఒక రోజు, మూడు రోజుల సదస్సు కాదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సదస్సు ద్వారా మహిళలు ఉత్సాహం, ఉత్తేజం పొందారని చెప్పారు. అన్ని రంగాల్లో భాగస్వాములై దీనిని ఒక జాతీయ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రతి సంవత్సరం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రంలో జరగడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. 
 
మరో దుర్గామాత సుమిత్రా మహాజన్ 
దేశవిదేశాల నుంచి వచ్చిన మహోన్నత మహిళల ప్రసంగాలతో మహిళలు, విద్యార్థినులు స్పుర్తి పొందారన్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  ఆమె పెళ్లి  జరిగిన తరువాత డిగ్రీ పూర్తి చేశారని చెప్పారు. మేయర్ గా, 27 ఏళ్లు ఎంపీగా ఉన్నారని వివరించారు. లోక్ సభను క్రమశిక్షణగా నిర్వహించడంలో ఆమె దిట్ట అన్నారు. ఈ విషయంలో ఆమె మరో దుర్గామాతగా అభివర్ణించారు.  మరో ముఖ్య విషయం ‘‘ మా అత్తగారి మద్దతు వల్లే నేను ఈ స్థానంలో నిలబడ్డాను’’ అని సుమిత్రా మహాజన్ తనకు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. 
 
అమరావతి వాస్తు
నూతన రాజధాని అమరావతి వాస్తు బాగుందని సీఎం చెప్పారు. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు. ఎవరైనా ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే వాళ్లే ఇబ్బందులు పడతారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ చనిపోయిన అర్థరాత్రే అర్థమైంది.. నా వైపు 129 ఎమ్మెల్యేలున్నారు జాగ్రత్త: శశికళ