అమరావతిలో వైకాపా ప్రభుత్వం చేస్తున్నది ఇళ్ల పండగ కాదనీ, పేదల్ని మోసగించే ప్రక్రియలో భాగంగానే వైకాపా ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులు, పేదలకు మధ్య గొడవలు సృష్టించేందుకే సీఎం జగన్ ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు.
గురువారం పార్టీ వ్యూహ కమిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఆర్ 5జోన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలు, వివేకా హత్య కేసు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఆర్డీఏ బృహత్ ప్రణాళికలోనే 5 శాతం భూమిని పేదల గృహ నిర్మాణానికి రిజర్వ్ చేయడంతో పాటు 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా ప్రభుత్వం 90 శాతం పూర్తిచేసిందని చంద్రబాబు చెప్పారు.
ఆర్-5 జోన్ పేరుతో పేదల్ని వంచించటమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తూ రెండు వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసేలా వైకాపా కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఇరు పక్షాలకూ ప్రయోజనం చేకూరేలా తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే.. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా వైకాపా కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.
వివేకా హత్య కేసు వాదించే న్యాయవాదులకే ప్రభుత్వ సంబంధిత కేసులు అప్పగించటం వెనుక ఆంతర్యమేంటని చంద్రబాబు నిలదీశారు. వివేకా హత్య కేసు నిందితుల తరపున వాదించే న్యాయవాదులకు ప్రభుత్వ కేసులు అప్పగిస్తూ.. వారికి ప్రజాధనం దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్-5 జోన్ వ్యవహారంలోనూ పేదల్ని వంచిస్తూ అధిక మొత్తంలో ప్రజా ధనాన్ని ఫీజుల రూపంలో న్యాయవాదులకు చెల్లిస్తున్నారని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వేసవిలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటంతోనే రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు.