Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని తరలింపును అడ్డుకోవాలి.. ఏం చేద్ధాం.. తెదేపా నేతన వ్యూహం

రాజధాని తరలింపును అడ్డుకోవాలి.. ఏం చేద్ధాం.. తెదేపా నేతన వ్యూహం
, ఆదివారం, 19 జనవరి 2020 (13:44 IST)
అమరావతి రాజధాని మార్పు నిర్ణయాన్ని ఆపడానికి చేయాల్సిందంతా చేయాలని.. తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడుగా ఉన్నారు. ఆయన 20వ తేదీన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమాలు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముట్టడి పిలుపు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి. 
 
అదేసమయంలో అసెంబ్లీ, శాసనమండలిలో పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో.. టీడీపీ ఉంది. రాజధాని తరలింపు అంశాన్ని నేరుగా బిల్లులో పెట్టకుండా పని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి విరుగుడు వ్యూహంపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. న్యాయనిపుణుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. 
 
శాసన మండలిలో బిల్లును తిరస్కరించటం లేదా రెండు, మూడ్రోజులపాటు చర్చ నిర్వహించాలని పట్టుబట్టడం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విధంగా తీర్మానం చేయటం వంటి మార్గాలను రెడీ చేసుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా వాదన వినిపించేందుకు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పాగోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 
 
బిల్లు ఏ రూపంలో ప్రభుత్వం తీసుకు వస్తుందనేది.. ఆసక్తికర అంశంగా మారింది. కౌన్సిల్‌లో ఏ రూపంలో వచ్చినా బిల్లుపై అప్పటికప్పుడు వ్యూహం రూపొందించుకునే బాధ్యతలను యనమల రామకృష్ణుడుకు అప్పగించారు. అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటంతో కౌన్సిల్‌లో ఆయన ప్రభుత్వ వ్యూహాల్ని తిప్పికొడతారని అంచనా వేస్తున్నారు. 
 
ప్రభుత్వ తరపు నుంచి చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని, ఇందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు శాసనసభాపక్ష సమావేశంలో వ్యూహాలను ఖరారు చేయనున్నారు. అదే విధంగా అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువైనప్పటికీ, గళం వినిపించడంలో దీటుగా ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. బయట అసెంబ్లీ ముట్టడి.. లోపల అధికార పక్షాన్ని కట్టడి చేసి.. అమరావతి నిర్ణయంపై ముందుకెళ్లకుండా చేయాలని టీడీపీ భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడియా రేప్ కేసు దోషులకు 30న శిక్ష ఖరారు