అమరావతి, పోలవరం నా రెండు కళ్లు.. పూర్తి చేసి తీరుతానంటూ చంద్రబాబు శపథం
ప్రపంచంలోని ఐదు ముఖ్యమైన రాజధాని నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు మూడో రోజయిన సోమవారం ‘ప్రజారాజధాని అమరావతి’పై పెట్టిన
అమరావతి, పోలవరం ప్రాజెక్టు తనకు రెండు కళ్లు లాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే అన్వయించారు. విభజనకు ముందు ఏపీ తెలంగాణ ప్రాంతాలు తనకు రెండు కళ్లు లాంటివని చెప్పి తెలంగాణలో వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు తన రెండు కళ్లూ అమరావతి, పోలవరంమేనని రూట్ మార్చారు. గతంలోలాగా కాకుండా ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిస్తే, ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే అది వ్యక్తిగా తనకూ, రాష్ట్రానికి కూడా మేలు చేకూర్చుతుందని జనాంతికం.
ప్రపంచంలోని ఐదు ముఖ్యమైన రాజధాని నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు మూడో రోజయిన సోమవారం ‘ప్రజారాజధాని అమరావతి’పై పెట్టిన తీర్మానంపై చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. ఈ సందర్భంలో ఆయన నూతన రాజధాని కోసం పడుతున్న ఇక్కట్లను, చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసనమండలిని కేవలం ఏడాదిలోగా పూర్తి చేశామన్నారు.
రాజధానికి సంబంధించి వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మూడు ప్రణాళికలు తయారు చేశామని, కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ కాన్సెప్ట్, సీడ్ కేపిటల్ ఏరియాలుగా విభజించామని తెలిపారు. లండన్‌కు చెందిన నార్మన్ అసోసియేట్స్ ఇస్తున్న ఐకానిక్ బిల్డింగ్ డిజైన్స్ దాదాపు పూర్తి కావొచ్చాయని చెప్పారు. అమరావతి అంటే తెలుగు జాతి గుర్తుకువచ్చేలా డిజైన్ చేస్తున్నట్టు వివరించారు. బలోపేతమాన రాజధానిని నిర్మించేందుకు ఎంత కష్టమైనా పడతానని, తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి ముందుకు సాగుతానని చెప్పారు.
హైదరాబాద్‌ను అష్టకష్టాలూ పడి గతంలో అభివృద్ధి చేసినట్లే అన్ని అవరోధాలను అధిగమించి ఏపీ రాజధానిని నిర్మిస్తానని, శంకుస్థాపనే బ్రహ్మాండంగా జరిగిందని, అన్ని ప్రార్థనా మందిరాల నుంచి ఆశీర్వచనాలు తెప్పించామని చంద్రబాబు తెలిపారు. భావితరాలకు తానిచ్చే కానుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని, రాజధానికి రైతులు సుమారు రూ.40వేల కోట్ల విలువైన 33,388 ఎకరాల భూమిని ఇచ్చారని, వారందరికీ వేలవేల దండాలు చెప్పాలన్నారు. ప్రజారాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.