గుండెల నిండా అమరావతి... బ్రాండ్ నేమ్ విస్తరిస్తోంది...
అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ నిర్మితమవుతున్న ఆధునిక నగరం అమరావతి ఇప్పుడు ఓ బ్రాండ్‌గా ఖ్యాతి పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా వేనోళ్ల కీర్తి పొందుతున్న నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావత
అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ నిర్మితమవుతున్న ఆధునిక నగరం అమరావతి ఇప్పుడు ఓ బ్రాండ్‌గా ఖ్యాతి పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా వేనోళ్ల కీర్తి పొందుతున్న నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి రాజధాని ప్రకటనతోనే దేశంలోనూ, అటు అంతర్జాతీయ పటంలోనూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది.
అమరావతి ఓ ట్రేడ్ మార్క్ సింబలైంది. అమరావతి ఒక బిజినెస్ మోడల్ అయింది. విద్యా కేంద్రానికి ఆయువుపట్టుగా మారబోతోంది. పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారనుంది. పరమశివుడు అమరేశ్వరునిగా కొలువైన దివ్యధామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త రాజధాని ఇప్పుడు ఓ బ్రాండ్ సింబల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
అమరావతి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఆలోచన చేసిన తర్వాత, చారిత్రాత్మక ప్రాంతమైన అమరావతి రాజధానిగా ఎంపిక చేయడం ఆయన దార్శనికత, ముందుచూపుకు నిదర్శనం. నాడు శాతవాహనుల కాలంలో విరాజిల్లిన అమరావతి రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, అత్యుత్తమ రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వారసత్వ నగరంగా అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి.. పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు అక్షర సత్యాలవుతున్నాయి.
అమరావతి వర్థిల్లాలి... అమరావతి వర్థిల్లాలి... ఇది పాలకుల, రాజకీయ నాయకుల మాటే కాదు... ఇది ప్రజల మాట. అది కూడా ఎక్కడి వారి మాటో కాదు... అమరావతి ప్రజల మాట. అవును ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంత ప్రజలు అమరావతి జపం చేస్తున్నారు. అవునండీ అమరావతి కలల సౌధం ఆవిష్కృతం కాక ముందే వారు తమ అమరావతితో తాము అనుకున్న కార్యక్రమాలను ఎంచక్కా చేసుకుంటున్నారు. అవును రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు విన్పిస్తోంది.
ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతోనో, దేవుళ్ల పేర్లతోనో వ్యాపారాలు మొదలుపెట్టే స్థానికులకు ఇప్పుడు అమరావతి పేరును బ్రాండ్ నేమ్ గా ఉపయోగించుకోవడం అమరావతి క్రేజ్ ను తెలియజేస్తోంది. కొత్త వ్యాపారానికి కాసులు కురిపిస్తుందని వారు నమ్ముతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 200కు పైగా వ్యాపార నిర్వాహకులు ఇప్పుడు అమరావతి పేరుతో తమ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తున్నారు.
వారందరిదీ ఒకటే మాట... ఒకటే పేరు... రియల్ వెంచర్లు, హోటళ్లు, రిసార్టులు, ఆసుపత్రులు, ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ఏవైనా కానివ్వండి... బ్రాండ్ నేమ్ ఒక్కటే అమరావతి. అమరావతి. అవును వ్యాపారం ఏదైనా సరే, ఆ వ్యాపారం అమరావతి పేరు చుట్టూనే తిరుగుతోంది. స్థానిక ప్రజలకు ఇప్పుడు అమరావతి ఫీవర్ పట్టుకొంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ పేరు ఇంటా, బయట మార్మోగేది. ఇప్పుడు అమరావతి పేరు అదే విధంగా పేరు ప్రఖ్యాతులు పొందుతోంది.
రాష్ట్ర రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతి నగరానికి సమీప ప్రాంతాల్లో నివశించే ప్రజలు ఇప్పుడు అమరావతి బాటలో నడుస్తున్నారు. వ్యాపారం చిన్నదైనా... పెద్దదైనా పేరు మాత్రం అమరావతి ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిన్నర క్రితం రాజధాని నగరంగా అమరావతి పేరు ప్రకటించక ముందు మనకు అమరావతి పట్టణం మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు అమరావతి పేరుతో వెలిసిన వ్యాపార, వాణిజ్య సముదాయాలకు లెక్కే లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజల్లో రాజధాని క్రేజ్ పెరుగుతూ వస్తోంది. దానికి చిహ్నమే అమరావతి పేరుతో వెలుస్తున్న దుఖాణాలు. అమరావతి పేరు పెట్టుకోవడం వల్ల తమ వ్యాపారాలకు మంచి మైలేజ్ వస్తుందని భావనలో స్థానికులు ఉన్నారు. అందకు అమరావతికి స్థానికులు జై కొడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఫెస్టివల్ లో నగర యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులను భారీ డిస్కౌంట్లకు ఇవ్వడంతోపాటు, సంగీత, నృత్యకార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఆర్టీసీ అమరావతి పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతోంది. అటు ప్రైవేటు ట్రావెల్స్ సైతం అమరావతి పేరుతో సర్వీసులను నిర్వహిస్తున్నాయి. స్థానికులు, రాజకీయవేత్తలు, వ్యాపార వేత్తలు అందరూ మా రాజధాని పేరుతో మేం వ్యాపారాలు చేస్తే తప్పేంటి? రాజధానికి మరింత ఊతమొస్తుందన్న నమ్మకంతోనే అమరావతి పేరు పెట్టుకున్నామని ప్రజలు చెప్తున్నారు. అమరావతి పేరు పెట్టుకోవడం ద్వారా తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మద్దతిస్తున్నామన్న సంకేతాలను వారు ఇస్తున్నారు.
అమరావతి పేరు కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టౌన్స్ కే కాదు... రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు అమరావతి నేమ్ రోజు రోజుకు పాపులర్ అవుతూ వస్తోంది. తాత్కాలిక రాజధాని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేటివ్ భవనాలకు ఇటీవలే శంకుస్థాపన జరగడం వచ్చే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది. సర్వం అమరావతి పేరు మార్మోగనుంది.