Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని పోరు : స్వచ్ఛందంగా గుంటూరు జిల్లా బంద్ .. తెదేపా ఎమ్మెల్సీలకు పోలీసు షాక్!

రాజధాని పోరు : స్వచ్ఛందంగా గుంటూరు జిల్లా బంద్ .. తెదేపా ఎమ్మెల్సీలకు పోలీసు షాక్!
, బుధవారం, 22 జనవరి 2020 (11:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని సమరం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా తొలి అడుగు వేసింది. ఇందులోభాగంగా, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ తర్వాత ఇదే బిల్లును శాసనమండలికి పంపగా అక్కడ సంపూర్ణ మెజార్టీ ఉన్న విపక్ష పార్టీలు బ్రేక్ వేశాయి. 
 
ఇదిలావుంటే, మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో స్వచ్ఛందంగా బంద్ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో మంగళవారం కొనసాగిన బంద్ బుధవారం గుంటూరుకు విస్తరించింది. గుంటూరులోని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆందోళనకారులు బస్టాండ్ వద్ద ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడుదామని ఆందోళనకారులు హెచ్చరించారు. 
 
మంగళవారం శాసన మండలిలో జరిగిన పరిణామాల తర్వాత తమకు మరింత ధైర్యం వచ్చిందని, పట్టుదల పెరిగిందని ఆందోళనకారులు అంటున్నారు. కీలక సమయంలో పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తీరును రైతులు తప్పుపట్టారు. మరోవైపు బంద్‌కు ఎటువంటి అనుమతులు లేవని గుంటూరు అర్బన్ ఎస్పీ స్పష్టం చేశారు. బస్సులను అడ్డుకోవడం, పాఠశాలలు, షాపులు మూయించడం చట్టవ్యతిరేకమవుతుందని ఆయన అంటున్నారు.
 
తెదేపా ఎమ్మెల్సీను అడ్డుకున్న పోలీసులు 
శాసనమండలి సమావేశాలకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. శాసనమండలికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలపై ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేకుండా ఎలా అడ్డుకుంటారని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలే వాహనాల్లో ఉంటే స్టిక్కర్లు ఎందుకని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాదోపవాదాలు జరిగాయి. కాసేపటి తర్వాత ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం శాసనసభ, మండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లలితా జ్యూవెలరీలో బంగారు బ్రాస్‌లెట్ చోరీ