అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తునన యాత్రకు తాము వ్యతిరేకం కాదని, యాత్ర పేరుతో తెలుగుదేశం రాజకీయాలు చేయటం తగదని ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే మేము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర అని, అదో రియల్ ఎస్టేట్ యాత్ర, భ్రమరావతి యాత్రగా ఆయన అభివర్ణించారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనని ,అమరావతి భూములకు బినామీ చంద్రబాబే, ఈ ఉద్యమానికి బినామీ కూడా ఆయనేనని ధర్మాన ఆరోపించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ టీడీపీ నాయకులు, శ్రేణులే ఉన్నారు. ఈ యాత్ర చేయిస్తున్నది నేనే అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
ఒక ఆన్యాయం నుంచి మరిన్ని అన్యాయాలకు దారి తీయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలకు మారు పేరుగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. 13 జిల్లాలు, మిగతా ప్రాంతాలు, మిగతా సామాజికవర్గాల వారిని కవ్విస్తూ, యాత్ర సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకు రావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాల మీద దండయాత్ర కాదా? అని ఆయన ప్రశ్నించారు.
అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి మా నాయకుడు సిఎం జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఆయన ఏం చేస్తామని చెప్పారో, దాన్ని దైవంగా భావించి చేసి చూపిస్తున్నారని ఉప ముఖ్య మంత్రి అన్నారు.