ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా ఏకపక్షంగా ఓడిపోయిన ఆరు నెలలకే, వైఎస్ జగన్ తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టి టీడీపీ కార్యకర్తలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటానని బెదిరిస్తూ వస్తున్నారు. నేటికీ, జగన్ బయటకు వచ్చినప్పుడల్లా, తిరిగి అధికారంలోకి రావడం గురించి తరచుగా మాట్లాడుతున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. 2024 ఓటమిని ఆయన ఇంకా అర్థం చేసుకోలేదు, దాని వెనుక ఉన్న కారణాలను కూడా ఆయన అంచనా వేయలేదు. 2024లో తాను ఎందుకు ఓడిపోయాడో లేదా 2029 ఎన్నికలకు గేమ్ ప్లాన్ ఏమిటో స్పష్టత లేకుండా, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాననే చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం జగన్ తరహాలో తెలంగాణలో కేటీఆర్ అదే పాట అందుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మీడియో సమావేశంలో తాను, తన బీఆర్ఎస్ పార్టీ మూడేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు.
"బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము 400 ఎకరాల HCU భూమిని తిరిగి తీసుకొని దానిని ఒక పర్యావరణ ఉద్యానవనంగా మారుస్తాము. కాబట్టి, ఈ భూములను కొనుగోలు చేయకుండా ఉండమని నేను ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీలను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మేము తిరిగి వచ్చిన తర్వాత, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని తిరిగి ఉపయోగించుకుంటాము." అని కేటీఆర్ అంటున్నారు.