Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్‌లో పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టుబడల సదస్సు: హీరో బాలకృష్ణ సెటైర్లు

Balakrishna

ఠాగూర్

, శుక్రవారం, 3 మే 2024 (08:58 IST)
వేలాది ఎకరాల భూములను ఇచ్చి అమరావతి ప్రాంత రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పోల్చారని సినీ హీరో బాలకృష్ణ అన్నారు. అలాంటపుడు విశాఖపట్టణంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న పెయిడ్ ఆర్టిస్టులు ఎవరి ఆయన ప్రశ్నించారు. పైగా, విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులో తేలిపోయిందన్నారు. 
 
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లి, విజయనగరంలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూములను కుదువపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, రేపు మీ అవసరాలకు ఆ భూమిపై రుణం తెచ్చుకోవాలనుకుంటే కుదరదని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన 25 సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించి కొనసాగిస్తామన్నారు. ఓటేసే ముందు ఐదేళ్లలో జరిగిన అరాచక పాలన మళ్లీ కావాలో, టీడపీ అభివృద్ధి కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. 
 
విద్య అంటే తెలియనివారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక సర్వే వెల్లడించిన వివరాల మేరకు ఐదో తరగతి పిల్లవాడు మూడో తరగతి స్థాయి లెక్కలనూ చేయలేకపోవడాన్ని ప్రస్తావించారు. దీన్నిబట్టి విద్యా ప్రమాణాలు ఏ రీతిలో ఉన్నాయో అర్థమవుతోందని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని విద్యాశాఖ మంత్రిని తల్లిదండ్రులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సభలో ఎన్డీయే కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టించుకోని ప్రభుత్వం... పింఛన్ల పంపిణీలో సమస్యలు... బ్యాంకుల్లో జమకానివారికి...