స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడగించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది. నేటితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తున్నందన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోవైపు ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బుధవారం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ తరపు వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. బుధవారం వాదనలకు కొనసాగింపుగా ప్రస్తుతం అదనపు ఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత చంద్రబాబు రిమాండ్ పొడగించే విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకుంటారు.