వైకాపా పాలనలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కుంభకోణంపై దర్యాప్తు ఆగస్టులో పూర్తయింది. రూ.119 కోట్ల క్రీడా అభివృద్ధి కార్యక్రమంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని నిర్ధారిస్తూ విజిలెన్స్ విభాగం ఆగస్టు 31న డీజీపీకి తన నివేదికను సమర్పించింది.
గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందని పలువురు క్రీడాకారులు, అసోసియేషన్ అధిపతులు ఆరోపించిన తర్వాత వివాదం మరింత తీవ్రమైంది.
ప్రైజ్ మనీ పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు, నాణ్యత లేని స్పోర్ట్స్ కిట్‌లు ఇచ్చారని ఆరోపణలలో ఉన్నాయి. దీనిపై మాజీ జాతీయ కబడ్డీ ఆటగాడు, అసోసియేషన్ ఆర్డీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్రలో కీలక నిర్ణయాధికారులు తీసుకునే హోదాలో క్రీడా మంత్రి రోజా వున్నారు.
విజిలెన్స్ విభాగం తన నివేదికను సమర్పించి 64 రోజులు కావస్తున్నా, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆడుదాం ఆంధ్రాలో సుమారు రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం.
ప్రధానంగా మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టార్గెట్‌గా ఈ విచారణ జరిగిందని వైసీపీ నేతలు చెప్తున్నారు. క్రీడల శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు నిర్వర్తించడంతో ఈ అవినీతిలో ఆమె పాత్ర వుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.