తన స్నేహితుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో కాపురమున్న అంజనా దేవి కుమార్తె రంజిత(18) విజయవాడలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటోంది.
కరోన వైరస్ ప్రభావంతో యువతి కొన్ని రోజుల క్రితం ఇంటికి చేరింది. ఈ క్రమంలో సహచర విద్యార్థితో ఫోన్లో తరచూ సంభాషించేది. గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో సంభాషించకుండా ఆపివేయడంతో మనస్థాపానికి గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి అంజనాదేవి ఏఎన్ఎం విధులు ముగించుకుని ఇంటికి రాగానే తన కుమార్తె ఫ్యానుకు వేలాడుతూ కనపడటంతో కేకలు వేసింది. ఈ సంఘటనపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ.రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై విలపించింది.