జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు ఆకాంక్షిస్తున్నారంటూ కాపు సంక్షేమ సంఘం నాయకుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ఆయన పలు సూచనలు, సలహాలు తెలిపారు.
తెదేపా-జనసేన కూటమి భాజపాను కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమనీ, కనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఏపిలో జనసేనకు 40 నుంచి 60 సీట్లు కేటాయించాలని కోరారు. ఐతే జనసేనకి 40 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మూడుచోట్ల పోటీ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం నుంచి ఆయన పోటీ చేయాలని చెప్పారు.